వెల్లుల్లి దొంగతనంతో వ్యక్తిని చితకబాదిన రైతులు

నగ్నంగా ఊరేగించడంపై పోలీసుల కేసు
భోపాల్‌,జనవరి7(జనంసాక్షి):  ¬ల్‌సేల్‌ మార్కెట్‌లో వెల్లుల్లి దొంగతనం చేశాడని.. ఓ వ్యక్తి బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల నుంచి రైతులు మందసౌర్‌లోని ¬ల్‌సేల్‌ మార్కెట్‌కు వెల్లుల్లి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఉన్న వెల్లుల్లి బస్తాల్లోని ఒక బస్తాను ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈ విషయాన్ని గ్రహించిన రైతులు.. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లకుండా.. ఆ వ్యక్తి బట్టలు విప్పించారు. ఆ తర్వాత నగ్నంగా చేసి అతని భుజాలపై వెల్లుల్లి బస్తాను ఉంచి మార్కెట్‌ చుట్టూ ఊరేగించారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. ఈ ఘటనపై మందసౌర్‌ పోలీసులు స్పందించారు. దొంగతనం చేశాడని నగ్నంగా ఊరేగించడం సరికాదన్నారు పోలీసులు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.