- ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం
- వ్యాపారమంటే లాభనష్టాలే..
- సంపద సృష్టి, ఆధునీకరణ నినాదంతో ముందుకెళ్తున్నాం
- ప్రధాని మోదీ స్పష్టీకరణ
దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్‌యూ) నడపలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వాటి ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన బుధవారం మాట్లాడారు.వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్లుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందన్నారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుందని వివరించారు. వారసత్వంగా వస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరు అని వివరించారు. 50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమన్నారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన బాటలను బడ్జెట్ వేసిందని మోదీ అన్నారు.