భారత్‌ బంద్‌ విజయవంతం

 


- స్తంభించిన రవాణా

- ఎక్కడిక్కడ నిలిచిపోయిన లారీలు

- ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపిన శశిథరూర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా భారత్‌ బంద్‌కు వాణిజ్య సంఘాలు పిలుపునివ్వడంతో రవాణాపై ప్రభావం చూపింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేరళ రాజధాని తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి రోడ్డుపైకి లాక్కొచ్చారు. చమురు ధరలు తగ్గించడంలో అటు కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఆ విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆటోలను తాళ్లతో లాగామని వివరించారు. చమురు ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది ఆటోలు పాల్గొన్నాయని థరూర్‌ వివరించారు. బంద్‌కు ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో పాటు పలు ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి. సిఎఐటి పిలుపుతో దేశవ్యాప్తంగా 40 వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ నిర్వహించారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా 1,500 ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నాయి. అయితే, మెడికల్‌, నిత్యావసరాలను బంద్‌ నుంచి మినహాయించారు. బంద్‌లో భాగంగా శుక్రవారం ఎక్కడి లారీలు అక్కడే నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం పిలుపునివ్వడంతో రహదారులపై ఎక్కడికక్కడ వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఎపిలోని విజయవాడలో రామవరప్పాడు, భవానీపురం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లిలో లారీలు పెద్ద సంఖ్యలో నిలిచాయి. విశాఖలోని గాజువాక యార్డులో ట్రాన్స్‌పోర్ట్‌ లారీలు అక్కడే నిలిచిపోయాయి. ఈ రోజు ట్రాన్స్‌పోర్ట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాజువాక లారీ యార్డ్‌ నుంచి డాక్‌ యార్డు వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా లారీలు నిలిచిపోయాయి. వరంగల్‌ నగరంలోని ఏనుమాముల మార్కెట్‌ దగ్గర 1,100 లారీలు నిలిచిపోయాయి.