మళ్లీ కరోనా విజృంభణ

 

అప్రమత్తమైన తెలంగాణ సర్కారు

కరోనా కేసుల పెరుగుదలతో అప్రమత్తం

సరిహద్దు జిల్లాల అధికారులకు సూచనలు చేసిన మంత్రి

హైదరాబాద్‌,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సరిహద్దు రాష్ట్రాల జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని

అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వైద్యశౄఖ అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, రోజూ కనీసం 50 వేల టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను మంత్రి ఈటల రాజేందర్‌ అప్రమత్తం చేశారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ పకడ్బందీగా చేయాలని సూచించారు. మహారాష్ట్ర, కర్నాటకలో కేసులు పెరుగుతుండటంతో మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లతో మంత్రి సవిూక్ష నిర్వహించారు. తమహారాష్ట్ర బార్డర్‌లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్లతో మాట్లాడారు. ఈ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాలకు రాకపోకలు ఎక్కువగా ఉన్నందున అక్కడ టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తిపై అలర్ట్‌గా ఉండాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, ఎగ్జామ్‌ హాల్స్‌లో కరోనా రూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. 102, 104, 108 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్‌ పక్రియ నిరంతరం కొనసాగుతుందని, అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాల అనుసంధానానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఈటల ఆదేశించారు. రెండు పథకాలను కలిపి అమలు చేస్తే వచ్చే సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు.