కేటీఆర్‌ విజన్‌కు గుర్తింపు


`


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం
` 2022లో జరిగే వార్షిక సమావేశానికి హాజరు కావాలని పిలుపు
` తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్‌ చేస్తున్న కృషిని
ప్రశంసించిన డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే
` ఐటీ,ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్తింపే ఈ గౌరవం
` రాష్ట్రంలో గ్లోబల్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది మరో అవకాశం
` హర్షం వ్యక్తం చేసిన మంత్రి కే.తారకరామారావు
హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరోసారి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దావోస్‌లో 2022లో జరిగే డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్‌ను డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే ఆహ్వానించారు. ఈ సమావేశం జనవరి 17 నుంచి 21 వరకు కొనసాగనుంది. తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్‌ చేస్తున్న కృషిని బోర్గే బ్రెండే ప్రశంసించారు.
మంత్రి కేటీఆర్‌ హర్షం
డబ్ల్యూఈఎఫ్‌ నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఆహ్వానాన్ని భావిస్తున్నాను అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను తెలియపరిచేందుకు, రాష్ట్రంలో గ్లోబల్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఆహ్వానం మరో అవకాశం అని మంత్రి పేర్కొన్నారు. డబ్ల్యూఈఎఫ్‌ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపిన నిర్వాహకులకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2020, జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్న విషయం తెలిసిందే.