బైడెన్‌ జీ.. మా రైతు సమస్యలపైనా దృష్టి సారించండి..


` మోదీ`బైడెన్‌ సమావేశం సందర్భంగా రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయిత్‌ ట్వీట్‌
దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి): భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రైతు సంఘం నేత రాకేష్‌ టికాయిత్‌ విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానితో జరిగే సమావేశంలో వీటిపై ప్రస్తావించాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ.. నేడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్న సందర్భంగా రాకేశ్‌ టికాయిత్‌ ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు.‘అధ్యక్షా.. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతులం ఆందోళన చేస్తున్నాం. గడిచిన 11 నెలలుగా జరుగుతోన్న ఈ నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకు దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మమ్మల్ని రక్షించడానికి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా మా ఆందోళనపైనా దృష్టి పెట్టండి’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో ప్రారంభమైన ఈ ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే సమయంలో సాగు చట్టాలపై రైతులకు ఉన్న అభ్యంతరాలు, ఇతర వర్గాల అభిప్రాయాలపై సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కూడా నివేదిక రూపొందించింది. ఆ నివేదికను త్రిసభ్య కమిటీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందజేసింది. మరోవైపు ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.