దుగ్గిరాలలో కోరం లేకే వాయది: ఆళ్ల

గుంటూరు,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 8 మంది సభ్యులు హాజరయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన సభ్యులు రాకపోవడంతో కోరం లేదని వాయిదా వేశారని తెలిపారు. 9 మంది ఎంపీటీసీలు గెలిచినా టిడిపి ఎందుకు సమావేశానికి రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఒక్కరు కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన సభ్యులు గెలవలేదని, బీసీ ఎంపీటీసీ లేకపోవడం వల్లే టీడీపీ ఎంపీపీ ఎన్నికకు హాజరు కాలేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ సభ్యులను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందని విమర్శించారు. ఎంపీపీ పదవికి ఉదయం 10 గంటలకే నామినేషన్ల సమయం ముగిసిందన్నారు. వైసీపీ అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ వేశారని తెలిపారు. ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామన్నారు. దుగ్గిరాల ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యులుగా వైసీపీ వారే గెలుస్తారని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.