తెలంగాణకు తలమాణికంగా యాదాద్రి

  


పచ్చదనం వెల్లివిరిసేలా హరితహారం
పభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
యాదాద్రి,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  తెలంగాణకు తలమాణికంగా యాదాద్రి పునరుద్దరణకు నోచుకోవడం అదృష్టమని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి దేవస్థానం ప్రాంతం పూర్తిగా ఆహ్లాద వాతావరణం సంతరించుకోబోతుందని అన్నారు. త్వరలోనే యాదాద్రి వైభవం ప్రజలకు సాక్షాత్కారం కానుందన్నారు. సిఎం కెసిఆర్‌ త్వరలోనే వచ్చి తగిన ముహూర్తం ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నామని అన్నారు. యాదాద్రి వైభవం చూస్తుంటే తన నియోజక వర్గంలో ఇంతటి పుణ్యక్షేత్రం ఉండడం అదృష్టమని అన్నారు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్నారని ఆమె ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధి కలసినప్పుడు తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇక్కడ హరితహారం పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు. పచ్చదనం పరిమళించేలా చేస్తున్నామని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించి
పనులు ప్రారంభించారన్నారు. భవిష్యత్‌లో యాదాద్రి కొండ దిగువ ప్రాంతాలలో జనాభా గణనీయంగా పెరగడంతో స్థానిక గ్రామ పంచాయతీలను అన్నిటినీ కలిపి పురపాలక సంఘంగా మార్చారని తెలిపారు. యాదాద్రి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న పనులు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. యాదగిరిగుట్ట పట్టాణాభివృద్ధికి రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. భవిష్యత్‌లో దిగువ ప్రాంతాలలో పెరిగే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు కనీసం 15 నుంచి 20 లక్షల లీటర్లకు పైగా నీరు అందుబాటులో ఉండేలా మిషన్‌ భగీరథ పథకం ద్వారా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో 100 డబుల్‌ బెడ్‌ రూమ్‌, అంబేద్కర్‌ భవనం మంజూరయ్యాయని అన్నారు. త్వరలో స్థలాన్ని సేకరించి డబుల్‌ బెడ్‌ రూంలు, అంబేద్కర్‌ భవన నిర్మాణం చేపడతామన్నారు. అన్ని వాడల్లో అంతర్గత రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను నిర్మిస్తామని హావిూనిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఒక వైపు గ్రామాల్లో అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. తమ సమస్యలను తీర్చాలంటూ వచ్చిన ప్రజలకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి వెంటనే తీర్చేలా తగుచర్యలు తీసుకుంటున్నారు. ఆలయానికి వస్తున్న భక్తుల పట్ల చూపిస్తున్న శ్రద్ధాసక్తులు, పని విూద ఉద్యోగులకు గల దృష్టి, భక్తులకు కల్పిస్తున్న వసతులు, దర్శనాల తీరుతెన్నులు, గోశాలలో గోవుల బాగోగులు, ఆలయానికి గల తోట నిర్వహణ తదితర అంశాలపై తాము నిర్దేశించుకున్న నిబంధనల మేరకు ఉన్నాయని అన్నారు.