సివిల్స్‌ ఫలితాల విడుదల


` ఫస్ట్‌అటెంప్ట్‌లోనే మన వరంగల్‌ అమ్మాయికి 20వ ర్యాంకు
దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి): అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష`2020 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ వెల్లడిరచింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శుభం కుమార్‌ మొదటి ర్యాంకుతో మెరిశారు. జాగృతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్‌ మూడో ర్యాంకు సాధించారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ తమ సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్‌ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్‌ సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు, డి. విజయ్‌ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి 747వ ర్యాంకు సాధించారు.
తొలి ప్రయత్నంలోనే వరంగల్‌ అమ్మాయి శ్రీజకు 20వ ర్యాంక్‌
సివిల్స్‌ 2020 ఫలితాల్లో వరంగల్‌ అమ్మాయి సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే పి శ్రీజ 20వ ర్యాంకు సాధించి, ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. సమాజ సేవ చేయడమే లక్ష్యంగా సివిల్స్‌ను ఎంచుకున్నానని శ్రీజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు.
20వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు
మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ 20వ ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదు. సెకండ్‌ క్లాస్‌లో ఉన్నప్పుడే హైదరాబాద్‌ వచ్చాను. నా చదువంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. పదో తరగతి వరకు రఘునాథ మోడల్‌ హైస్కూల్‌లో, ఇంటర్‌ శ్రీచైతన్య కాలేజీలో, ఎంబీబీఎస్‌ ఉస్మానియా కాలేజీలో 2019లో పూర్తి చేశాను.
నాన్న సేల్స్‌ మేనేజర్‌.. అమ్మ నర్సు..
నాన్న శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ హోండా షోరూమ్‌లో సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అమ్మ లత జనగామ జిల్లాలో నర్సుగా పని చేస్తున్నారు. తమ్ముడు సాయిరాజ్‌ గ్రాడ్యుయేట్‌ చదువుతున్నాడు.నాన్న ప్రోత్సహంతోనే సివిల్స్‌ వైపు దృష్టి పెట్టాను. నాన్న చాలా సపోర్ట్‌ చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతూనే చాలా సినిమాలు చూశాను. ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో చర్చించి, విషయ పరిజ్ఞానం సంపాదించుకునేదాన్ని.
రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సార్‌, బాలలత మేడమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
సివిల్స్‌ కోచింగ్‌, ఇంటర్వ్యూ విషయంలో నన్ను ఎంతో ప్రోత్సహించిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సార్‌, బాలలత మేడమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. యూపీఎస్సీ సిలబస్‌ చాలా నచ్చింది. ఇష్టపడితే కష్టం కాదు అనేది నేర్చుకున్నా. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ సమయంలో చాలా కష్టపడ్డాను. హైదరాబాద్‌లోనే కోచింగ్‌ తీసుకున్నాను. ఇంటర్వ్యూ హెల్త్‌ అంశాలపైనే కొనసాగింది అని శ్రీజ తెలిపారు.
అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఎంపిక..
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు సివిల్స్‌లో సత్తా చాటారు. రాళ్లపల్లి జగత్‌సాయి 32వ ర్యాంకు, వసంత్‌ కుమార్‌ 170వ ర్యాంకు సాధించారు. వీరి తండ్రి భీమేశ్వరరావు విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. గుండుగొలను గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఒకేసారి సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల గ్రామస్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్‌ ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్‌ నిట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశారు.