మంత్రి పెద్దిరెడ్డిపై చర్య తీసుకోండి

ఇసికి బిజెపి నేత సోము వీర్రాజు ఫిర్యాదు

కడప,అక్టోబర్‌23 జనంసాక్షి :  మంత్రి పెద్దిరెడ్డిపై బీజేపీ రాష్ట అద్యక్షుడు సోమువీర్రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ నాయకులు, మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ వాలంటీర్లను ప్రభావితం చేయడంతో ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించి వారికి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై తక్షణం చర్యలు చేపట్టాలని రిటర్నింగ్‌ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానందుకు సోమువీర్రాజు వినతి చేశారు. ఉప ఎన్నికలో మంత్రి తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. అక్కడ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం చేయడం తగదన్నారు.