ఇక నిరంతరంగా హరితహారం కార్యక్రమం


నిధుల కొరత లేకుండా హరితనిధి ఏర్పాటు

హరితనిధి కింద కొత్తగా టాక్స్‌ విధింపునకు ప్రతిపాదన
స్కూల్‌ నుంచి కాలేజీ వరకు..రిజస్టేష్రన్లపైనా ఇక గ్రీన్‌ టాక్స్‌
హరితహారంపై చర్చలో సిఎం కెసిఆర్‌ వివరణ
కంపా నిధులు రాష్టాల్రు సమకూర్చిన నిధులేనని వెల్లడి
హైదరాబాద్‌,అక్టోబర్‌1 (జనంసాక్షి): తెలంగాణలో చేపట్టిన హరితహారంత మంచి ఫలితాలను ఇస్తోందని, దీనిని మరింత పక్కాగా నిర్వహించేందుకు నిధుల కొరత రాకుండా చేయాలని సంకల్సించామని సిఎం కెసిఆర్‌ తెలిపారు. అలాగే దీనిని నిరంతర కార్యక్రమంగా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే విజయవంతం గా కొనసాగుతోన్న హరితహారానికి తోడుగా తెలంగాణ హరిత నిధి కార్యక్రమానికి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదన చేశారు. నిరంతరంగా హరిత ఉద్యమాన్ని కొనసాగించడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. దీంతో కొత్తగా ఇప్పుడు హరిత టాక్స్‌ విధించాలని నిర్ణయించారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ హరిత నిధిపై ప్రకటన చేశారు. మన రాష్ట్రంలో పని చేసే ఐఏఎస్‌ అధికారులతో మాట్లాడగా వారు ప్రతి నెల వారి జీతం నుంచి హరిత నిధికి రూ. 100 ఇస్తామని ఒప్పు కున్నారు. ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లు కూడా రూ. 100 ఇస్తామని ఒప్పుకున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. న్యాక్‌ ద్వారా 0.1 శాతం ఇవ్వాలని ప్రపోజ్‌ చేస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి నెల రూ. 25ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి నెల రూ. 500 హరిత నిధికి ఇవ్వాలని కోరాం. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంగీకరించారు. మిగతా పక్షాలకు కూడా అప్పీల్‌ చేస్తున్నాను. వారు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నానని సిఎం కెసిఆర్‌ తెలిపారు. లైసెన్సెస్‌ రెన్యూవల్‌ చేసే సమయంలో రూ. 1000.. హరిత నిధి కింద జమ చేయాలని కోరుతాం. భూముల అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు ప్రతి రిజిస్టేష్రన్‌కు హరిత నిధి కింద రూ. 50 కలెక్ట్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థుల పాత్ర కూడా ఇందులో ఉండాలని నిర్ణయించాం. విద్యార్థులు తమ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు పొందే సమయంలో.. స్కూల్‌ విద్యార్థులు రూ. 5, హైస్కూల్‌ విద్యార్థులు రూ. 15, ఇంటర్‌ విద్యార్థులు రూ. 25, డిగ్రీ విద్యార్థులు రూ. 50, అదే విధంగా ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే విద్యార్థులు రూ. 100 ఇస్తే హరిత నిధికి తోడ్పాటు ఉంటుందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని యూఎన్‌వో గుర్తించి ప్రశంసించింది. ఈ గ్రీన్‌ ఫండ్‌ ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ హరిత నిధికి నిరంతరం నిధుల కూర్పు జరిగితే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇకపోతే కాంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావని, వందశాతం అది రాష్టాల్ర డబ్బులు మాత్రమే అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నీటి ప్రాజెక్టులు, రోడ్లకు, లేదా ఇతర అవసరాల కోసం అటవీ భూములను కొనుగోలు చేస్తాం. అడ్వాన్స్‌ కింద రాష్టాల్రు కేంద్రానికి డబ్బులు చెల్లించాలి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్రం వద్ద జమ చేసిన డబ్బు రూ. 4675 కోట్లు. ఇవి మనం కట్టిన డబ్బులే. కేంద్రానిది నయా పైసా కూడా లేదన్నారు. అయితే మోదీని కలిసి కాంపా నిధులు విడుదల చేయాలని కోరాం. మొత్తానికి 4

సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. అయితే మనకు ఇచ్చే నిధుల్లో 10 శాతం కేంద్రం కట్‌ చేస్తుంది. మొత్తం ఇవ్వాలని అడిగాం. పరిశీలన చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కాంపా నిధుల్లో భాగంగా రాష్టాన్రికి రూ. 3,109 కోట్లు నిధులు విడుదల చేశారు. ఇందులో రూ. 1320 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా కింద రూ. 3673 కోట్లు ఖర్చు చేశాం. హెచ్‌ఎండీఏ ద్వారా రూ. 367 కోట్లు, జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 83 కోట్లు ఖర్చు చేశాం. నర్సీరల పెంపకం, ఏర్పాటు, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఖర్చు చేశాం. నిధుల దుర్వినియోగం జరగడం లేదు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం రూ. 6,555 కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్‌ వెల్లడిరచారు. మన రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ కింద 67,276 కి.విూ. ఆర్‌ అండ్‌ బీ కింద 28,080 కి.విూ. నేషనల్‌ హైవేస్‌ కింద 4 వేల కి.విూ. ఉన్నాయి. అన్నీ కలిపితే 1,00,156 కి.విూ. మేర రోడ్‌ లెంత్‌ ఉంది. ఇందులో 82491 కి.విూ. మేర ప్లాంటేషన్‌ చేశారు. పంచాయతీరాజ్‌ కింద 59 వేల కిలోవిూటర్లు కవర్‌ చేశారు. ఆర్‌ అండ్‌ బీ వారు 8652 కి.విూ. మేర మొక్కలు నాటారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ అధికారులు.. జాతీయ రహదారులపై మొక్కలు నాటి, వారి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హరిత నిధి ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు , ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. హరిత నిధి ఏర్పాటుకు అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో స్వాగతించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధి ఏర్పాటుతో తెలంగాణకు హరితహార కార్యక్రమ నిర్వహణ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
``````````