రైల్వే ఉద్యోగులకు బోనస్‌


దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి): రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ)గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై రూ.1985 కోట్ల మేర భారం పడనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయాల్‌ విూడియా సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడిరచారు. ఉత్పాదకత ఆధారిత బోనస్‌ కింద నెలకు గరిష్ఠంగా రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌గా అందనుంది.అలాగే, దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్ట్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌ (పీఎం`మిత్ర) పార్కుల ఏర్పాటుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వివరించారు. రాబోయే ఐదేళ్లలో రూ.4,445 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగాను.. 14 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర పార్కులను అభివృద్ధి చేయనున్నాయని తెలిపారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపించాయని గోయల్‌ వెల్లడిరచారు.