అనేక గ్రామాల్లో నీటమునిగిన పంటలు

కడప,అక్టోబర్‌11(  జనంసాక్షి): కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక ఎకరాల్లో వేరుసెనగ పంట వేయగా మొత్తం నీట మునిగింది. వేలఎకరాల్లో వరి, పత్తి, వేరుసెనగ,పసుపు, పచ్చిమిర్చి పంటలు నీట

మునిగాయి. చాలా చోట్ల వరి, అరటి, వేరుసెనగ, పత్తి పంటలు నీటమునిగి కుళ్లుదశకు చేరుకున్నాయి. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం వివరాలు సేకరించి ఆదుకోవాలని రైతులు, బాధితులు కోరుతున్నారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ప్రవహిస్తు న్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, వరి, పసుపు, వేరుసెనగ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని చెరువులకు గండ్లుపడి నీరంతా వృథాగా దిగువకు వెళ్తొంది.. లోతట్టు ప్రాంతాల్లోని సామాన్యజన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రాదారుల్లో కోతలు ఏర్పడి వాహన రాకపోకలు స్తంభించాయి. నిత్యం వర్షాభావంతో సతమతమయ్యే కడపలో కరవుతీరా వానలు కురవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుక్క నీటికి మొహం వాచిపోయిన కడప గడపలో ఇప్పుడు ఎటుచూసినా నీరు దర్శనం ఇస్తోంది. రైతాంగం ఆనందానికి అవధుల్లేవు.. వరుస వర్షాలతో జలవనరులన్నీ నిండుకుండల్లా తళతళలాడుతున్నాయి. పలుగ్రామాల్లో కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. రెవెన్యూ అధికారులు తమ గ్రామంలో పర్యటించి ఆదుకోవాలని వారు అర్ధిస్తున్నారు. అదే సందర్బంలో గ్రామాల్లోని వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి.