ఉత్తరాఖండ్‌లో విషాదం..


` పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి
దేహ్రాదూన్‌,అక్టోబరు 23(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మధ్య ఉండే హార్సిల్‌`చిట్కుల్‌ ట్రెక్‌ రూట్‌లో పర్వతారోహణకు వెళ్లిన 11 మంది బెంగాలీ ట్రెక్కర్లు మంచు చరియలు విరిగిపడి గల్లంతయ్యారు. సమాచారమందుకున్న ఉత్తరాఖండ్‌ పోలీసులు.. వాయుసేన సాయంతో పర్వతాలపై గాలింపు చేపట్టారు. దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. హెలికాప్టర్‌ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. వీరిలో ఏడుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. ఇద్దరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. కాపాడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.లంఖాగాపాస్‌లో పర్వతారోహణకు వెళ్లిన మరో 11 మంది ట్రెక్కర్ల బృందం కూడా గల్లంతైనట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. వీరిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమవగా.. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడిరచారు.వీరిలో పర్యాటకులతో పాటు పోర్టర్లు, గైడ్లు కూడా ఉన్నారు. అక్టోబరు 18న వీరు తిరుగు ప్రయాణం అవుతుండగా.. వాతావరణ పరిస్థితుల కారణంగా భారీగా మంచు కురియడంతో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో వారంతా గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. వెంటనే అధికారులు వాయుసేనకు అత్యవసర సందేశం పంపగా.. అక్టోబరు 20 నుంచి రెండు అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.