చిన్నమ్మకు మద్దతుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌


  చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నమ్మ ప్రతినిధిగానే ఆయన రాజకీయ పయనంలో ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలికతో ఆయన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేశారు.

తొలుత చిన్నమ్మ ఈ కళగంకు ప్రతినిధిగా పేర్కొన్నా, చివరకు తానే ప్రధాన కార్యదర్శి ఆయన చాటుకున్నారు. అన్నాడీఎంకే కైవసంలో చిన్నమ్మకు కోర్టుల్లో చట్టపరంగా కొత్త చిక్కులు ఎదురు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ  పరిస్థితుల్లో తాజాగా చిన్నమ్మ దూకుడు పెంచారు. అన్నాడీఎంకే కేడర్‌ను తన వైపుకు తిప్పుకుని పార్టీ కైవశంకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు.