ఆపరేషన్‌ కాశ్మీర్‌ ఇప్పుడే అవసరం !

ఆపరేషన్‌ కాశ్మీర్‌ చేపట్టాల్సిన అవసరాన్ని తాజా ఘటనలు గుర్తు చేస్తున్నాయి. అక్కడ 370 ఆర్టికల్‌ రద్దు చేయడం కాదు..ఉగ్రవాదులను ఏరివేయాలి. ఇల్లిల్లూ గాలించి కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి వివక్షా ఉండరాదు. పాక్‌తో సహా తాజాగా తలిబన్ల సహాయంతో కాశ్మీర్‌లో ఊచ కోతలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారికి ఊతమిస్తున్న, ఆశ్రయమిస్తున్న వారిని ఏరివేయాల్సిందే. దేశస్వాంత్య్రానంతరం నెహ్రూ చేసిన తప్పిదాలకు ఇప్పుడు అక్కడి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. అలాగేకాశ్మీర్‌లో సగభాగం కోల్పోయాం. అయినా కాశ్మీర్‌ అభివృద్దికి వేలకోట్ల రూపాయను కేటాయించినా, అక్కడ యువత పాక్‌ ఉగ్రవాద ఉచ్చులో ఇరుక్కుంటూ భవిష్యత్‌ను సర్వనాశనం చేసుకుంటూ ఊచకోతల కు పాల్పడుతోంది. తొలిదశలో స్వాతంత్య్రా నంతరం నెహ్రూ అవలంబించిన విధానాల కారణంగా అక్కడ ఉగ్రమూకలు తిష్టవేసి హిందువులను ఊచకోత కోశాయి. లక్షలాది కుటుంబాలను తన్నితరిమేశాయి. అక్కడే ఉండాలనుకున్న వారిని బలవంతంగా మతం మార్చారు. కాశ్మీర్‌ పండిట్లను ఊచకోతకోసి,మతం మార్చి నానాహింసలు పెట్టిన సంగతిని మరచిపోలేం. ఎన్నో ఘోరాలు..మరెన్నో మారణహోమాలు జరిగినా ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు రాజ్యం ఏలాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కశ్మీర్‌ విధానంపై విమర్శలు చేస్తున్న లెఫ్ట్‌,కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఇంతకాలం రావణకాష్టం రగిల్చిన విషయాన్ని మర్చిపోరాదు. కశ్మీర్‌ సమస్య ఈనాటిది కాదని, ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కశ్మీర్‌లోయలో శాంతి, అభివృద్ధికి భాజపా చేసినంతగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం అక్కడ అశాంతిని రాజేస్తోంది.పాకిస్థాన్‌ నుంచి చొరబడే ఉగ్రవాదులను మట్టుబెట్టకుండా భద్రతా బలగాలను ఎప్పుడూ విశ్రమించలేదు. కాశ్మీర్‌ భారత దేశానికి మణిమకుటం లాంటిది. అలాంటి రాష్ట్రం తీవ్రవాద సమస్యల్లో చిక్కుకోవడం దేశానికి ఎప్పటికీ మంచిది కాదు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే తీవ్రావాద శక్తుల విజృంభించి కాశ్మీర్‌లోయను రక్తమోడేలా చేస్తూ వచ్చాయి. తాజా ఘటనలు ఇక క్షమించరాని నేరంగా చూడాలి. తుపాకుల మోత ఆగిపోతుందని ఆశించిన కాశ్మీరీయులకు నిరాశే మిగిలింది. కానీ ఉగ్రవాద ప్రేరేపిత మత ఛాందసులు భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్నారు. కాశ్మీర్‌ కల్లోలభరితం కావడానికి, కాశ్మీరీయులు తుపాకీ నీడలో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడడానికి పాక్‌ గడ్డవిూది నుంచి ఉగ్రవాదులను తయారు చేసి ఎగదోయడమే కారణమని వేరుగా చెప్పక్కరలేదు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో శాంతికి అవకాశం ఏర్పడినప్పుడల్లా పాక్‌ రంగప్రవేశం చేస్తోంది. మోడీ ప్రభుత్వం అనుసరించిన ఉగ్రవాద ఏరివేత విధానాల మూలంగా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్‌ నేరుగా పౌరులు, భద్రతా జవాన్లపై కాల్పులు జరుపుతూ వస్తోంది. దీంతో మనవైపు నుంచి ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌లో నిరసనలు, వేర్పాటువాదుల డిమాండ్లు పాక్‌ ప్రేరేపితమైనవేనని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. రెండు వైపులా ఉన్న వేర్పాటువాద, మత ఛాందసవాద సంస్థలు ఘర్షణలను రెచ్చగొట్టి కాశ్మీర్‌ను రావణ కాష్టంలా మార్చుతు న్నాయి. 370 ఆర్టికల్‌ రద్దు తరవాత దారికొస్తున్న పరిస్థితులను జీర్ణించుకోలేని పాక్‌ ఉగ్రమూకలు అక్కడ

బరితెగించి అమాయకులను బలి తీసుకుంటున్నాయి. తాజాగా కశ్మీర్‌లో జరుగుతున్న వరుస సంఘటనల్లో కశ్మీరీ పండిట్లు సహా అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రతాదళాల ప్రాణత్యాగం చేయడం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. గడచిన ఆరేళ్ళ గణాంకాల లెక్కలు తీస్తే తీవ్రవాదులు భద్రతాదళాల బదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. కశ్మీరీ పండిట్‌ అయిన ప్రసిద్ధ కెమిస్ట్‌ సహా ముగ్గురు
పౌరులను మంగళవారం కొద్ది గంటల వ్యవధిలో తీవ్రవాదులు కాల్చి చంపడం అందుకు ఉదాహరణ.
ఆ రక్తపుమరకలు ఆరక ముందే గురువారం శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి తుపాకీలు ధరించిన ఆగంతుకులు చొచ్చుకు వచ్చి, టీ తాగుతున్న ప్రిన్సిపాల్‌పై, మరో కశ్మీరీ పండిట్‌ టీచర్‌పై అతి సవిూపం నుంచి కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. జనంతో మమేకమయ్యేందుకు కేంద్ర మంత్రులు పలువురు తొమ్మిది వారాల కార్యక్రమం చేస్తున్న సమయంలో గత పది రోజుల్లో ఇలా ఏడుగురు పౌరులను బలి తీసుకున్న ఉగ్రమూకల విషయంలో ఏమాత్రం రాజీపడరాదు. మతపరంగా అస్థిరతను సృష్టించి, పండిట్లు, సిక్కుల్లో భయాన్ని పెచ్చరిల్ల జేయడం కోసమే ఈ దాడులని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇలా 27 మంది పౌరుల ప్రాణాలను ఉగ్రమూకులు బలితీసుకన్నాయి. కశ్మీర్‌లోని ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా కొన్నాళ్ళుగా దాడులు జరుగుతున్నాయి. ఏ వర్గంతోనూ సంబంధం లేని అమాయ కులను చంపడం ద్వారా దశాబ్దాలుగా అక్కడ శాంతియుతంగా జీవిస్తున్న అల్పసంఖ్యాకులను భయపెట్ట డమే లక్ష్యంగా చేసుకున్నారు. 370 రద్దు తరవాత కశ్మీర్‌కు తిరిగిరావాలనుకొనే వారిని హెచ్చరించడమే ఉగ్రమూకల లక్ష్యంగా ఉంది. ఇలాంటి దుర్మార్గులను తుదముట్టించాల్సిందే. ఇప్పటికైనా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రోజువారీ వ్యవహారంగా మారిన హింసకు ముగింపు పడేలా చూడాలి.
తీవ్రవాదం పంజా విసిరిన 1990లలో ఎందరో పురిటిగడ్డను వీడిపోయి బతుకుజీవుడా అంటూ దేశంలోనే అనేక ప్రాంతాల్లో కాందిశీకుల్లా బతుకుతున్నారు. ఇక ఉన్న ఊరును వదిలి వెళ్లేక అక్కడే బతుకుతున్న కొద్ది కశ్మీరీ పండిట్ల కుటుంబాల నైతిక స్థైర్యం దెబ్బతీయడం లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడు తున్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్‌ కుయుక్తులు, ఈ దాడులతో ప్రజలను భయభ్రాంతలుకు గురిచేసి కాశ్మీర్‌ను వీడేలా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. వేర్పాటువాదానికి పాకకతో పాటు తాలిబన్ల నుంచి ఊతం అందుతున్న తీరును ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. కాశ్మీర్‌ను అవసరమైతే అవసరమైతే జల్లెడ పట్టాలి. అక్కడి ప్రజల రక్షణకు ఎంతటి చర్యలకైనా దిగాలి. ఉగ్రవాదులు అక్కడికి రావాలంటేనే భయపడేలా చేయాలి. అప్పుడే స్థానికులకు భరోసా కలుగుతుంది.