రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండాలని కోరాం


అందరిదీ ఒకే మాట అన్న అంబికా సోనీ

న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. రాహుల్‌ పార్టీ అధ్యక్షుడు కావాలన్నది అందరి అభిప్రాయమని సోనీ చెప్పారు. అయితే అధ్యక్ష పదవిని చేపట్టాలా వద్దా అన్నది ఆయనే నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఎక్కడా కూడా జీ`23 (పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన 23 మంది సీనియర్లు) ప్రస్తావన రాలేదని అంబికా సోనీ తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వర్గాలుగా విడిపోలేదన్న ఆమె, తామంతా ఐక్యంగా ఉన్నామన్నారు. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.