మాల్యాకు శిక్ష ఖరారుపై జనవరి 18నుంచి విచారణ

  

 


దర్యాప్తు సంస్థలకు తగిన సమయమిచ్చాం: సుప్రీం

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, మద్యం వ్యాపారి విజయ్‌మాల్యకు శిక్ష ఖరారుపై వచ్చే ఏడాది జనవరి 18 నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించనున్నది. అప్పటికల్లా విజయ్‌ మాల్యను స్వదేశానికి తీసుకొస్తారా.. లేదా.. అన్న అంశంతో నిమిత్తం లేకుండా విచారణ ప్రారంభం కానున్నదని తెలిపింది. స్వదేశానికి మాల్యను తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలకు తగినంత సమయం ఇచ్చామని, ఇక వేచి ఉండలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. విజయ్‌ మాల్య తన వాదనను వినిపించేందుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోతే ఆయన తరఫు న్యాయవాది సమక్షంలోనే శిక్ష ఖరారు చేయనున్నది. ఇప్పటికే విజయ్‌ మాల్య కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డాడని జస్టిస్‌లు యూయూ లలిత్‌, ఎస్‌ రవీంద్రభట్‌, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. కరోనా మహమ్మారి వేళ ఈ కేసు విచారణ పదేపదే వాయిదా పడటంతో జాప్యమైందని విదేశాంగశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిందని తెలిపింది. భారత్‌కు విజయ్‌ మాల్య అప్పగింత పక్రియ బ్రిటన్‌లో చివరిదశకు చేరుకున్నదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. అయితే కొన్ని చట్ట పరమైన పక్రియలు కొనసాగుతున్నాయని, అవి రహస్యం కావడంతో వివరాలు తెలియడం లేదని పేర్కొన్నది. ఒక క్రిమినల్‌ గైర్హాజరీలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి చట్టంలో ఎటువంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం తెలిపింది.కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణాల ఎగవేతకు పాల్పడినట్లు విజయ్‌ మాల్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయ్‌ మాల్యకు వ్యతిరేకంగా ఎస్బీఐ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బ్రిటన్‌లో విజయమాల్య అప్పగింత పక్రియ కొనసాగుతు న్నందున విచారణకు మరికొంత టైం ఇవ్వాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.