రైతులకోసం ఏ త్యాగానికైనా సిద్ధం
మహాధర్నాలో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్,నవబంర్18(జనం సాక్షి ): కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్రం దిగొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్ పార్టీ మహా ధర్నాలో ఆయనమాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విూడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసమే సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని వెల్లడిరచారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఒక పార్టీయేనా అని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, ప్రధాని మోదీ స్పందించిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందన్నారు. గత రెండేండ్లుగా కేంద్రం ధాన్యం కొనడం లేదని చెప్పారు. ఇప్పటివరకు కొన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. అన్నదాతకు వెన్నుదన్నుగా జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మహాధర్నాకు వచ్చారు.