తెలంగాణ వ్వయసాయం గురించి బిజెపికేం తెలుసు
అంతిమ విజయం రైతులదే అన్న మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్,నవబంర్18(జనం సాక్షి ): ఐక్యమత్యంగా ఉంటే రైతులదే అంతిమ విజయం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతు ప్రయోజనాలకోసం మహాధర్నా చేపట్టామని, రైతుల కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాలో కూర్చున్నారని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించిందని చెప్పారు. రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని, కేంద్ర అస్పష్ట విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని, ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడం లేదని విమర్శించారు. వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని చెప్పారు. రాష్ట్రంలో అద్భుత ప్రాజెక్టులు కట్టారని, దీంతో బీడు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయని వెల్లడిరచారు. రైతు బంధు వంటి పథకాలతో రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. సాగు గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. కిషన్ రెడ్డికి ఎద్దులు లేవు.. బండి సంజయ్‌కి బండి లేదని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అన్ని సీజన్లలో వరి పండుతుందని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసవిూక్షించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే నష్టపోతుందని చెప్పారు. ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనని చెప్పారు.