చలికాలం ఆరోగ్య సమస్యలు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

 హైదరాబాద్‌,నవంబర్‌26 (జనం సాక్షి ):  చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజన్స్‌ మారినప్పుడు వ్యాధుల ప్రభావం మరింత పెరుగుతుంటాయి. చలికాలంలో చాలా మంది ఎక్కువగా జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా చల్లటి వాతావరణంలో ఉండడం వలన గొంతు సమస్యలు.. ముక్కు దిబ్బడ, జలుబు చేయడం వంటివి కలుగుతుంటాయి. అలాగే ఈ సీజన్లో అనారోగ్య సమస్యలను నియంత్రించు కోవడం ఎంత ముఖ్యమో.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. ఇక జలుబును తగ్గించు కునేందుకు ప్రతిసారీ సప్లిమెంట్స్‌ కాకుండా.. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనూ ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. శీతాకాలంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. అనారోగ్య సమస్యలు మాత్మమే కాకుండా.. జుట్టు, చర్మ, సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం వలన కీళ్ల నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయ. ఉసిరి, నెయ్యి, బజ్రా, ఖర్జూరం, బాదం, ఆవాలు, పచ్చి కూరలు మొదలైనవాటి వలన ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. చలికాలంలో జలుబును తగ్గించి వెచ్చగా ఉంచే పదార్థాలు వాల్‌ నట్స్‌, బాదంపప్పు. వాల్‌ నట్స్‌ వేడిని కలిగిస్తాయి. దీంతో శరీరం వెచ్చగా ఉండడం మాత్రమే కాదు. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. పిల్లలకు వెచ్చిన బట్టలువేసినట్లుగానే వయసుపైబడ్డ వారు సైతం వెచ్చిన బట్టలు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.