బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

 


వ్యవసాయ చట్టంతో రైతులకు తీరని నష్టం : మంత్రి సత్యవతి

మహబూబాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు. ఏడాది కాలంగా వీటిని సమర్థిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు.  ఇప్పటికైనా బీజేపీ కండ్లు తెరిచి రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడి రైతుమేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకళ్లు గ్రామంలో సోమవారం ఉమామహేశ్వర దేవస్థానంలో లింగ పునఃప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొని మాట్లాడారు. కార్తీక సోమవారం రోజున ఉమా మహేశ్వర స్వామి లింగ పునః ప్రతిష్ట, ధ్వజ స్థంభం ప్రతిష్ట చేసుకోవడం, అందులో భాగం కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. గ్రామస్థులందరికి అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషా లతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ వేస్తున్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎఎస్‌ పార్టీదే అన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ పై ఉన్న ఆదరాభిమానాలు, కేసీఆర్‌ నాయకత్వంపై ఉన్న గురికి ఈ విజయాలు నిదర్శనం అన్నారు. రైతులకు ఏం కావాలో అది సాధించడానికి సీఎం కేసిఆర్‌ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢల్లీి వెళ్లారు. బీజేపీ ప్రభుత్వం కొంతమంది ప్రయోజనాల కోసం పనిచేయడం మానుకోవాలి. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు, విలాసవంతమైన జీవితం గడిపేందుకు వీలుగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి వారికోసం కాకుండా రైతుల కోసం, సామాన్యుల కోసం పనిచేస్తే మంచిదని హితవు పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు శ్రీనివాసరెడ్డి, యాదగిరి రెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్‌, మనోజ, సత్యనారాయణ రెడ్డి, గ్రామ ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.