స్వచ్ఛంద పదవీవిరమణకు ప్రభుత్వం ఆమోదం
కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్దం
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం
ఎమ్మెల్సీలుగా కడియం, గుత్తా,కౌశిక్ రెడ్డి,ఆకుల లలిత,రవీందర్ రావులు
రాజ్యసభకు మధుసూధనాచారిని పంపించే ప్రయత్నాలు
హైదరాబాద్,నవంబర్15(జనం సాక్షి ): రాష్ట్రరాజకీయాల్లో అనూహం పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వెంకట్రామిరెడ్డి అందజేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. వెంకట్రామి రెడ్డి గజ్వెల్,సిద్దిపేటల్లో ప్రభుత్వ కార్యక్రామలను నమ్మకంగా ముందుకు తీసుకుని వెళ్లారు. ప్రధానంగా కాళేశ్వరం జలాల తరలింపు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ల నిర్మాణంలో కలెక్టర్‌గా పనిచేశారు. ముంపు గ్రామలను తరలించడంలో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల. 1991లో గ్రూప్`1 ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీసుల్లో వెంకట్రామిరెడ్డి చేరారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేండ్లు జేసీగా, కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పని చేశారు. సిద్దిపేటలో సిఎం కెసిఆర్‌కు నమ్మిన బంటుగా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లారు. ఇదిలావుంటే ఉదయం నుంచి అటు విూడియాలో.. ఇటు సోషల్ విూడియాలో పెద్ద ఎత్తున సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా అంశం వినిపించింది. ఆయన రాజీనామా చేయబోతున్నారని.. ఆయనకు ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చిందని టీఆర్‌ఎస్‌లో చేరిన నిమిషాల్లోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ మాటలన్నీ కొన్ని గంటల్లోనే అక్షరాలా నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే తాను రాజీనామా చేస్తున్నట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించేశారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం.. ఆ వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్వర్వులు జారీ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రాజీనామా అనంతరం బీఆర్కే భవన్ నుంచి ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాల్లో తాను పని చేశానని తెలిపారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీలో ఎప్పుడు చేరాలనే ఆదేశాలు ఇంకా రాలేదని ఆయన తెలిపారు. ఆదేశాలు వస్తే త్వరలోనే కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని.. సీఎం దిశానిర్దేశం మేరకు రాష్టాభ్రివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. కలెక్టరేట్ నుంచి అసెంబ్లీలోకి వెంకట్రామిరెడ్డి అడుగుపెట్టబోతున్నారని స్పష్టమయ్యింది. మరోవైపు.. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఏడుగురిని కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలితలకు ప్రగతి భవన్ నుంచి పిలుపొచ్చింది. అయితే ఇంతవరకూ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారని ప్రచారం జరిగిన మధుసూదనాచారికి మాత్రం పిలుపు రాలేదు. అయితే.. గవర్నర్ కోటలో మధుసూదనాచారికి అవకాశం ఇస్తారని తెలియవచ్చింది. ఎమ్మెల్సీపై చాలా మంది టీఆర్‌ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.