రోడ్డు దాటుతున్న వారిని ఢీకొనడంతో ఇద్దరు మృతి
హైదరాబాద్,డిసెంబర్6 (జనంసాక్షి); నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అయోధ్యరాయ్, దేవేంద్రకుమార్ దాస్‌గా గుర్తించారు. వారిద్దరు ఓ ప్రవైట్ దవాఖానలో పనిచేస్తున్నారని, చాయ్ తాగేందుకు బయటకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో కారును ఉప్పల్‌కు చెందిన రోహిత్ గౌడ్ నడుపుతున్నాడని, అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.