.ఎన్డీఏ అంటే నో డాటా అవేలబుల్‌..` మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా.

.'

హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్ష సభ్యులు అడుగుతున్న పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం దాటవేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా పలు అంశాలను విపక్షాలు ప్రస్తావిస్తే.. జవాబు చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. వాటిలో కొన్ని అంశాలను మంత్రి కేటీఆర్‌ లేవనెత్తుతూ.. ఎన్డీఏ అంటే నో డాటా అవేలబుల్‌ అని ట్వీట్‌ చేశారు.కేంద్రం వద్ద చనిపోయిన ఆరోగ్య కార్యకర్తల లెక్కలుండవు. కరోనా వల్ల మూతపడ్డ పరిశ్రమల లెక్కలుండవు. వలస కూలీల మరణాలపై లెక్కలుండవు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారి లెక్కలుండవు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ లబ్ధిదారుల లెక్కలుండవు. రైతు ఆందోళనల్లో మృతి చెందిన అన్నదాతల మరణాలపై లెక్కలుండవు అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు కొన్ని జాతీయ విూడియా క్లిప్పులతో పాటు లోక్‌సభలో ప్రశ్నోత్తరాలకు సంబంధించిన నోట్‌ను ట్యాగ్‌ చేశారు.