రికార్డు బద్దలు కొట్టిన జోరూట్‌

ఈ ఏడాదిలో ఏకంగా 1541 పరుగులు

బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ సారధి జోరూట్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఆస్టేల్రియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 86 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఫలితంగా ఈ ఏడాది ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా చేసిన 86 పరుగులు కలుపుకుని ఈ ఏడాది అతడు సాధించిన పరుగుల సంఖ్య 1541కి చేరింది.  ఒక క్యాలెండర్‌ ఏడాదిలో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదిలో రూట్‌ ఏకంగా 1541 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ మాజీ సారధి మైకెల్‌ వాగన్‌ పేరిట ఉండేది. 2002లో ఈ మాజీ సారధి 1481 రన్స్‌ చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు రూట్‌ బద్దలుకొట్టాడు.