ఆ ఎంపీలు క్షమాపణ కోరితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తాం

  


కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి

రాజ్యసభలో ఎంపిల ఆందోళనతో సభ వాయిదా

న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) :

రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మరోసారి స్పందించారు. ఆ 12 మంది ఎంపీలను ఎందుకు సభ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందో తాము సభాముఖంగా వివరించామని అన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ఆఖరులో సభలో ఏం జరిగిందనే దానికి యావత్‌ దేశం సాక్షిగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏవిూ లేదని, సస్పెన్షన్‌లో ఉన్న ఆ 12 మంది ఎంపీలు క్షమాపణ కోరితే.. వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. వర్షాకాల సమావేశాల చివరలో సదరు ఎంపీలు ప్రవర్తించిన తీరుకు శిక్షగా శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. అయితే, ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలావుంటే పార్లమెంట్‌ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రారంభం అయిన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడిరది. సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ పై ప్రతిపక్షలు ఆందోళనకు దిగాయి. వెంటనే ఎంపీలపై వేసిన సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో సభను వాయిదా వేశారు.  మరోవైపు వాయిదా తీర్మానం నోటీసుల్ని కూడా రాజ్యసబ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సభలో సభ్యుల ఆందోళనతో రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలో కూడా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. లోక్‌ సభలో స్పీకర్‌ పోడియం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. రబీలో పండే ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.