గబ్బా స్టేడియంలో పరిమళించిన ప్రేమలవ్‌ ప్రపోజల్స్‌తో ఏకమైన జంట

  


బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇక్కడి గబ్బా స్టేడియంలో ఆస్టేల్రియా`ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు స్టేడియంలో ఓ జంట లవ్‌ ప్రపోజల్‌ అందరినీ ఆకర్షించింది. మైదానంలో ఇద్దరు ప్రత్యర్థులు హోరాహోరీగా పోరాడుతుంటే స్టాండ్స్‌లో మాత్రం ఇరు దేశాలకు చెందిన యువతీయువకులు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడం మూడో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. బార్మీ ఆర్మీ ఫ్యాన్‌ గ్రూప్‌ సభ్యుడైన ఇంగ్లండ్‌ అభిమాని తన గాళ్‌ ఫ్రెండ్‌ ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె ఆస్టేల్రియా జెర్సీ ధరించి ఉంది. అతడలా మోకాళ్లపై కూర్చున్నాడో లేదో.. మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలన్నీ ఠక్కున అటువైపు తిరిగాయి. మోకాళ్లపై కూర్చున్న అతడు ఆమెకు ఉంగరం చూపిస్తూ.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ప్రేమగా అడిగాడు. ఆ మాట విన్న ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంగీకరించింది. వెంటనే అతడిని హగ్‌ చేసుకుని, ముద్దులు కురిపించింది. ఇది చూస్తున్న స్టేడియంలోని ప్రేక్షకులు వారిని మరింత ఉత్సాహ పరిచారు. కరతాళ ధ్వనులతో స్డేడియాన్ని హోరెత్తించారు. యువతి పేరు నటాలీ కాగా, ప్రేమను ప్రపోజ్‌ చేసిన ఇంగ్లండ్‌ అభిమాని పేరు రాబ్‌ హేల్‌. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి.