సిరివెన్నెలకు చిత్రపరిశ్రమ ఘన నివాళి













ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద నటీనటుల శ్రద్దాంజలి

చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌ తదితరుల నివాళి

హైదరాబాద్‌,డిసెంబర్‌1((జనంసాక్షి): ):  తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి  కన్నీటి వీడ్కోలు పలకడానికి ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా ఫిలిం ఛాంబర్‌కు తరలివచ్చారు. ఉదయం పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెలకు నివాళులర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం నగరంలోని ఫిల్మ్‌ చాంబర్‌ కు తరలించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకుని సిరివెన్నలకు నివాళులర్పించారు.  దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకుని సిరివెన్నలకు నివాళులర్పించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మణిశర్మ, గుణశేఖర్‌ లు సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఇక, తనికెళ్ల భరణి, సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి, దగ్గుబాటి రానా, అల్లుఅర్జున్‌, బాలకృష్ణ, అల్లు అరవింద్‌, దిల్‌ రాజులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.  మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించడానికి ముందు అభినుల సందర్శనార్థం పార్థివ శరీరాన్ని ఫిలిం చాంబర్‌కు తరలించారు. లంగ్‌ క్యాన్సర్‌తో మంగళవారం సాయంత్రం సిరివెన్నెల కన్నుమూసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు ఎవరూ కూడా భర్తీ చేయలేరని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. సమాజాన్ని మేల్కొలిపే సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవన్నారు. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్‌ తీసుకోవాలని చెప్పాను. తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పానన్నారు. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదన్నారు. కిమ్స్‌ హాస్పిటల్‌కి వెళ్లే ముందే తనతో ఫోన్లో మాట్లాడారని.. పుట్టిన వెంటనే ఎవరు కూడా మెగాస్టార్‌ కాలేరని చాలా సందర్భాల్లో తనతో అనేవారన్నారు. హీరోలు మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌, నాగార్జున, శర్వానంద్‌, నాని, శ్రీకాంత్‌ లు సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం సిరివెన్నెల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ...బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావడం లేదని... అలాంటి మాటలను వర్ణించడంలో కూడా ఆయనే అని తెలిపారు. తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం ఆయన సాహిత్యం బతికి ఉంటుందన్నారు. తెలుగు చలన చిత్రసీమకు ఆయన ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఆయన పాటలు రాబోయే తరాలకు బంగారు బాటలని చెప్పారు. సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు.