ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఆలయాల కోసం ప్రవేశపెట్టిన ధూపదీప నైవేద్యం (డీడీఎన్‌) పథకం అటు అర్చకులతోపాటు ఇటు భక్తులకూ ఆత్మస్థయిర్యం కల్పించిందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.  ఇది ఆలయాల పునరుద్దరణకు కూడా తోడ్పడుతుందని అన్నారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే ధూప దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో డీడీఎన్‌ పథకం ద్వారా ప్రభుత్వం ఆలయాల్లో అర్చకులకు వేతన భరోసా అందిస్తోంది. కొత్తగా మరికొన్ని దేవాలయాలను డీడీఎన్‌ పథకంలో మంజూరుకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. అనేక గ్రామాల్లో ఉన్న అర్చకులు లబ్దిపొందుతున్నారని అన్నారు.  దేవాదాయ శాఖ 2009లో ధూప దీప నైవేద్యం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అర్చకులకు వేతనంగా కేవలం రూ.2,500 నిర్ణయించింది. అయినా అర్చకులు చాలీచాలని వేతనంతో అసంతృప్తిగానే సరిపెట్టుకుంటూ వస్తున్నారు. అర్చకుల సమస్యలతోపాటు భక్తులను దృష్టిలోకి తీసుకున్న తెలంగాణ సర్కారు డీడీఎన్‌ పథకంలో పని చేస్తున్న అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన గౌరవం ఇస్తూ ప్రతి నెలా 1వ తేదీనే ట్రైజరీల ద్వారా వేతనం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అర్చకుల వేతనాన్ని కూడా రూ.2,500 నుంచి ఏకంగా రూ.6 వేలకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. దూప దీప నైవేద్యం పథకం కింద లబ్ధిపొందేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్చకులు, నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.