దేశంలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌ కేసులు

  

గుజరాత్‌లో మరో రెండు కేసులు నమోదు

25కుచేరినమొత్తం కేసుల సంఖ్య

దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు

న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో అలజడి సృష్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు విదేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి, ఇప్పుడు చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25కు చేరింది. డిసెంబర్‌ 4న జింబాబ్వే నుంచి భారత్‌ తిరిగొచ్చిన ఎన్నారై వ్యక్తికి కోవిడ్‌ కొత్త వేరియంట్‌ సోకగా.. ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్‌ లో పెట్టారు. అతడితో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు.  దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న 10 మందిని అధికారులు క్వారెంటైన్‌లో ఉంచి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన భార్య, బావమరిదికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గుజరాత్‌లో మూడు ఓమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఖరాడి తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో ఒమిక్రాన్‌ కేసుల మొత్తం సంఖ్య 25కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢల్లీిలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో సహా 57 దేశాలు ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారినపడ్డాయి. ఇదిలావుంటే  దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు కాగా... 624 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 94,943 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి  7,678 మంది బాధితులు కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,74,735 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744కి చేరింది. ఇప్పటివరకు 131.2 కోట్లపై పైగా టీకా డోసులు పంపిణీ జరిగాయి.