ఆందోళనలో అన్నదాతలు
కాకినాడ,డిసెంబర్3 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారే సూచనలతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లా రైతులు కలవరపడుతున్నారు. ఈ తుపాను హెచ్చరికలతో రైతులు హడావుడిగా నూర్పిళ్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉండడంతో చేలల్లో కోసిన పనలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకుని సంరక్షించుకోవడానికి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వరిసాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం ఉన్న వరి పంటను సంరక్షించుకునేందుకు రైతులు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను కదలికల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. చేలల్లో ఉంటే భారీ వర్షాల వల్ల ముంపునకు గురై ధాన్యం మరోసారి మొలకెత్తే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడే యుద్ధ ప్రాతిపదికన రేయింబవళ్లు వరి మాసూళ్లు చేసే పనిలో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి పంట నష్టాలు నమోదు చేయడంలో అధికారులు ఉన్నారు. తుపాను బారిన పడకుండా అటు రైతులు ఇటు ప్రజలు ఎవరికి వారే ముందస్తు జాగ్రత్తల్లో ఉన్నారు.