పాస్‌పోర్ట్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలి

మార్గదర్శకాలు విడుదల చేసిన రీజినల్‌ కార్యాలయం

హైదరాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: విదేశాలకు వెళ్లాలనుకునే పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారికి హైదరాబాద్‌లోని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ కార్యాలయం నుంచి తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు తమ అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్లి అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించాలని ఈ మార్గదర్శకాల్లో తెలిపారు. కొన్ని ఫేక్‌ వెబ్‌సైట్లు కూడా పాస్‌పోర్టు సేవలు అందిస్తామని మోసాలకు పాల్పడుతున్నాయని, కావున ఇలాంటి వెబ్‌సైట్స్‌ను నమ్మొద్దని చెప్పారు. అలాగే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్స్‌ కోసం తయారు చేసిన ఎంపాస్‌పోర్ట్‌ సేవయాప్‌ను కూడా ప్రజలు ఉపయోగించుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా పాస్‌పోర్టు గడువు ముగిసిందా చూసుకోవాలని, కనీసం ఆరు నెలల గడువు ఉండగానే రీన్యూ చేసుకోవాలని సూచించారు. కొన్ని దేశాలు పాస్‌పోర్టులో రెండు పేజీలు, అంతకంటే తక్కువ ఉంటే వీసాలు మంజూరు చేయడం లేదని తెలియజేశారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్టులు రీన్యూ చేయించుకోవాలని సూచించారు.