పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌


ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్‌కేంద్రం తీరుపై మండిపడ్డ ఎంపిలు

సర్కార్‌ దిగిరాకపోవడంతో శీతాకల సమావేశాల బహిష్కరణ

న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి)  ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు పార్లమెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఉభయసభల టీఆర్‌ఎస్‌ సభ్యులు నల్ల దుస్తులు ధరించి హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదాపడిరది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఉభయసభలకు చెందిన టీఆర్‌ఎస్‌ సభ్యులు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం సమగ్ర విధానం తీసుకురావాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని, రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్‌లను ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు.  పార్లమెంట్‌లో ఆదినుంచీ టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన కొనసాగింది. మంగళవారం కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో స్పీకర్‌ పోడియం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని కూడా ఎంపీలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం కుళ్లిపోయే పరిస్థితి వచ్చిందని, ఆ ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరారు. యాసంగి ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతోందని కేకే అన్నారు.