ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణం
బండా ప్రకాశ్‌ మినహా ఐదుగురితో ప్రమాణస్వీకారం

ప్రమాణం చేయించిన మండలి ప్రోటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి

ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌,డిసెంబర్‌ 2 ( జనం సాక్షి ) : తెలంగాణ శాసన మండలిలో ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బండా ప్రకాష్‌ మినహా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి, వెంకట్రమిరెడ్డి , తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, గుత్తా సుఖేందర్‌ రెడ్డి చేత మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. అయితే బండాప్రకాశ్‌ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేస్తారు. శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఎన్నికను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత జూన్‌ 3న ఆరుగురు ఎమ్మెల్యే కోటా శాసన మండలి సభ్యుల పదవీ కాలపరిమితి పూర్తికాగా వారి స్థానంలో నవంబర్‌ 22న ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.  తాజాగా ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని నిబంధనల మేరకు వీరు ఎన్నికైనట్లు గెజిట్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన వారిలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్‌రాంరెడ్డి, బండా ప్రకాశ్‌ ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ మండలికి ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన 14 రోజుల్లో రాజ్యసభకు రాజీనామా చేయాలనే నిబంధన మేరకు గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బండా ప్రకాశ్‌  చెప్పారు. గవర్నర్‌ కోటాలో ఎన్నికైన మధుసూధనాచారితోపాటు బండా ప్రకాశ్‌ ఈ నెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి 4న 12 మంది సభ్యుల పదవీ కాల పరి మితి ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల పక్రియ కొనసాగుతోంది. 12 స్థానాలనుగాను ఇప్పటికే ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో ఆరు స్థానాలకు ఈ నెల 10న పోలింగ్‌ జరగనుంది. జనవరి 4 తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యే 12 మంది పదవీ ప్రమాణం చేస్తారు. శాసనమండలి శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావులకు  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి  పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. మంత్రి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే యన్‌.భాస్కర్‌ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు ఉన్నారు.