తమిళనాడులోనూ మరోమారు కలకలం

  


విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌

చెన్నై,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. తాజాగా విదేశాల నుంచి తమిళనాడు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. సింగపూర్‌ నుంచి తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రాయానికి, బ్రిటన్‌ నుంచి చెన్నైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడిరచారు. దీంతో వారిని దవాఖానకు తరలించామని, వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలకు చెన్నై, బెంగళూరుకు పంపించామని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే తారాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. తిరుప్పూర్‌ జిల్లా తారాపురంలోని పాఠశాలల్లో వైద్యబృందాలు విద్యార్థులకు పరీక్షలు చేపడుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాలల్లోని ముగ్గురు సిబ్బంది సహా 27 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్దారణ కావడంతో వారిని సవిూపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు, పాఠశాల, పరిసర ప్రాంగణాల్లో క్రిమినాశిని మందు పిచికారీతో పాటు మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.