వేములవాడ కోసమే చల్మెడకు ఆహ్వానం ?

పార్టీలో.. స్థానిక ప్రజల్లో విస్తృతంగా చర్చ

చెన్నమనేనికి ప్రత్యామ్నాయంగానే అంటున్న జనం

వేములవాడ,డిసెంబర్‌9(జనం సాక్షి ): వేములవాడ ఎయమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కేసులో తీర్పు ఎలా వచ్చినా ..అందుకు సిద్దంగా ఉండాలని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ముందస్తు వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై ఇప్పటికే కోర్టుల్లో కేసు నడుస్తోంది. జర్మనీ పౌరసత్వం ఉన్న చెన్నమనేనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోచెన్నమనేని పౌరసత్వంపై వ్యతిరేక తీర్పు వస్తే వేముల వాడ ఉప ఎన్నిక కూడా అనివార్యం కానుంది. ఈ క్రమంలో ముందుచూపుతో సిఎం కెసిఆర్‌ కరీంనగర్‌ జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ నేత చల్మెడ లక్ష్మీ నరసింహరావును టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్టపికే ఆయన  కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. అయితే దీని వెనుక ఏం జరిగిందన్న ప్రచారంలో అసలు విషయాలను స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చల్మెడ చేరికపై పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ 2009 నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు తనయుడు అయిన రమేశ్‌ జర్మనీలో స్థిపడ్డారు. అయితే రమేష్‌ పౌరసత్వంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన భారత పౌరుడు కాదని స్థానిక నేత కేసు వేశారు. దీనిపై ఇప్పటికే చెన్నమనేనికి వ్యతిరేకంగా పరిస్థితి ఉంది.  ఏ క్షణం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో అనే ఉత్కంఠ అధికార పార్టీలో నెలకొంది. కోర్టు కేసులు పక్కన పెడితే ఆయన స్థానికంగా అందుబాటులో ఉండడని కూడా  మరో అపవాదు ఉంది.  పేరుకే వేములవాడ ఎమ్మెల్యే అయినా ఉండేది మాత్రం విదేశాల్లో అనే విమర్శలుతో పాటు అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో చెన్నమనేని పౌరసత్వంపై ప్రతికూల తీర్పు వస్తే ఆయన ఎమ్మెల్యే పదవి రద్దవుతుంది. అలా జరిగితే ఉప ఎన్నిక అనివార్యం కావచ్చు. ఈ క్రమంలో మరో వెలమ వర్గానికి చెందిన చల్మెడను ముందు జాగ్రత్తలో భాగంగా కెసిఆర్‌ సిద్దం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇక్కడ బిజెపి కూడా బలంగా ఉండడంతోనే ఈ ముందస్తు జాగ్రత్త అని అంటున్నారు.