ఆర్టీసీ బస్సులో ప్రసవం..



గుడ్‌ న్యూస్‌ చెప్పిన సజ్జనార్‌ 

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి): ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయాణికుల్ని ఆకర్షించే విధంగా సజ్జనార్‌ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సమస్యల పట్ల కూడా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే తాజాగా సజ్జనార్‌ మరో అనూహ్య ప్రకటన చేశారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రసవించిన ఇద్దరు మహిళలకు ఆయన శుభవార్త చెప్పారు. గత నెల 30న నాగర్‌కర్నూలు, ఈనెల ఏడవ తేదీన సిద్ధిపేట ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ మార్గమధ్యలో గర్భిణులు బిడ్డలకు జన్మనిచ్చారు. ఆర్టీసీ బస్సులో వీరు ప్రసవించారు. దీంతో వెంటనే ఆర్టీసీ సిబ్బంది 108కు సమాచారం అందించి ప్రసవించిన మహిళలను ఆస్పత్రిలో చేర్పించారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు సజ్జనార్‌ ప్రకటించారు. అంతేకాకుండా బస్సులో జన్మించిన ఇద్దరు పిల్లలకు జీవితాంతం బస్సులో ప్రయాణం చేసేందుకు పాస్‌లు అందించినట్లు సజ్జనార్‌ ప్రకటించారు.