కాంట్రిబూషనరీ పెన్షన్‌ రద్దుకు సమరశంఖం

ఉద్యోగ సంఘాల ఆందోళనలో నిర్ణయం

శ్రీకాకుళం,డిసెబర్‌11 (జనంసాక్షి)   కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేసేవరకు ఐక్య పోరాటాలను చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేలా చర్యలు చేట్టాలని నాయకులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ఉద్యోగుల ఆందోళనలో పెన్షన్‌ పునరుద్దరణపై చర్చ జరిగింది. సీపీఎస్‌ రద్దు చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఉద్యోగులు తమ సత్తా చూపుతారని అన్నారు. భవిష్యత్తు రాజకీయంగా ఉద్యమిస్తా మన్నారు. ఉద్యమాల ద్వారానే సీపీఎస్‌ అంతం సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. నూతన వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పీఆర్సీ, బకాయిలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. కొత్త పీఆర్సీ నియామకానికి సీఎం సుముఖంగా ఉన్నారని అన్నారు. సీపీఎస్‌పై గత 13 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నామని, అయినా పాలకులు స్పందించడం లేదన్నారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. సీపీఎస్‌పై పాలకులు తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ విధానం రద్దుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.