విదేశాల్లో రహానే బాగా రాణిస్తాడు: ఎమెస్కే


ముంబై,డిసెంబర్‌10(జనం సాక్షి ): దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌ టెస్ట్‌ జట్టును బీసీసీఐ ప్రకటించినా..గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని అజింక్య రహానే పై వేటు తప్పదని అంతా భావించనప్పటికీ.. అనుహ్యంగా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే రహానెను వైస్‌ కెప్టెన్‌ భాధ్యతల నుంచి తప్పించి రోహిత్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో సెలక్టర్లు రహానెను ఎందుకు ఎంపిక చేశారో భారత  మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్‌స్కే ప్రసాద్‌ తెలిపాడు. విదేశీ పిచ్‌ల్లో రహానెకు  వున్న రికార్డుల వల్ల అతడివైపు  సెలక్టర్లు మొగ్గు చూపారని ఎమ్‌స్కే ప్రసాద్‌ చెప్పాడు. ’జట్టు ఎప్పుడూ జూనియర్లు, సీనియర్లు కలయిక తో సమతూకంగా ఉండాలి. రహానే విషయానికి వస్తే..2013లో టెస్ట్‌ క్రికెట్‌లో అద్బుతంగా రాణించాడు. సాధరణంగా రహానే విదేశాల్లో బాగా రాణిస్తాడు. కానీ స్వదేశంలో అతడికి పెద్దగా రికార్డులు లేవు. గత కొద్దికాలంగా అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. ఈ క్రమంలో సెలెక్టర్లకు అతడిని ఎంపిక చేసే ముందు కాస్త అయోమయంకు గురై ఉంటారు. అయితే విదేశాల్లో అతడికి ఉన్న ట్రాక్‌ రికార్డును చూసి సెలెక్టర్లు ఎంపిక చేసుండవచ్చు’ అని  ఎమ్‌స్కే ప్రసాద్‌ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా విదేశాల్లో రహానే 40 సగటుతో 3000పైగా పరుగులు సాధించాడు. ఇక సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌`17న  భారత్‌` దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది.