మరోమారు పెరిగిన కూరగాయల ధరలు


స్వల్పంగా తగ్గి 40కి చేరిన టమాటాలు

వరంగల్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): మరోమారు కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరనిగాయి. మొన్నటి వరకు టమాటా వందదాకా పెరగ్గా ఇప్పుడు 40 నుంచి 50కి కిలో అమ్ముతున్నారు. బీరకాయ అయితే వందదాకా అమ్ముతున్నారు. బెండకాయలదీ అదేదారి. ధరలు పెరగడంతో శుభకార్యాలు చేసే వారు కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. శుభకార్యాల్లో ఎక్కువగా వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, క్యాప్సికం, బీరకాయలు, పచ్చిమిర్చితో పాటు సాంబారు కోసం మునగ కాయలను వినియోగిస్తారు. ప్రస్తుతం వివాహాది శుభకార్యాలు జోరుగా ఉన్న సమయంలో వీటి ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. సాంబారు కోసం వినియోగించే మునకాయలు ధర రికార్డు స్థాయిలో కిలో రూ.400కు చేరుకుంది. కాయ ఒక్కటి 20 వరకు అమ్ముతున్నారు. మొన్నటి వరకు కిలో రూ.100 వరకు లభించిన మునగ ఇప్పుడు రూ.400 పెట్టినా నాణ్యతగా లభించడం లేదు. వంకాయలు, కాప్సికం ధర మొన్నటి వరకు రూ.40కి కిలో ఉండగా, ప్రస్తుతం రూ.100కు కిలోచొప్పున విక్రయిస్తున్నారు. రూ.40కి కిలోచొప్పున లభించిన బెండ, బీర, దొండ, కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. కిలో రూ.30 ఉన్న పచ్చిమిర్చి ధర కిలో రూ.60కి చేరింది. కొత్తివిూర ధరలు తగ్గినా కరివేపాకు కట్ట 5రూపాయలకు తగ్గడం లేదు. దీంతో మార్కెట్లో ధరలతో గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉల్లిపాయలు కూడా 40 నుంచి 50 మధ్యన అమ్ముతున్నారు.