సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు
గుంటూరు,డిసెంబర్3 (జనంసాక్షి) : గత ఇరవై రోజులుగా ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులు వీయటంతో తీరప్రాంత రైతులు భయానక వాతావరణంలో ఉన్నారు. పంటపొలాలన్నీ నీటిలోనే నానుతూ దర్శనమిస్తున్నాయి. డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకాకపోవటంతో పంట పొలాల్లోని నీరు బయటకు వెళ్ళే పరిస్థితిలేకుండాపోయింది. మోకాల్లోతు నీటిలోనే వరిపైరు నాని మొలకలు రావటంతో పెట్టుబడికూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు భయాందోళన చెందుతున్నారు. లక్షలాదిరూపాయలు పెట్టుబడి పెట్టి అధికవర్షాలతో పంటంతా కోల్పోయామంటూ రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కూలినాలి చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని వరి సాగుచేస్తే బాగా పండిరదని మురిసిపోయిన రైతన్న పంటను కొతకోసి ఇంటికి తెచ్చుకుందామన్న తరుణంలో అల్పపీడనం రూపంలో నీటి పాలైందంటూ తీరప్రాంత రైతులు భోరున విలపిస్తున్నారు. పలు మండలాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి వేయగా 20వేల ఎకరాలకు పైనే వరిపైరు నేలవాలి నీటిలో నానుతున్న దయనీయ పరిస్థితి. పంటను చూసి తెచ్చిన అప్పు తీర్చుకుందామని ఆశపడ్డ రైతన్నకు అధిక వర్షాలతో పంటంతా నీటిపాలై నిరాశనే మిగిల్చింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అకాల వర్షాల కారణంగా వీటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. దీనిలో 40 శాతం పంట కంకుల నుంచి మొలకలొచ్చి గింజకూడా దక్కని విధంగా పనికిరాకుండాపోయింది. మిగిలిన పంట గింజలు రాలిపోగా, ఉన్న కొద్దిపాటి కంకులు రంగుమారి నల్లగా మారిపోయాయి. ఈ తరుణంలో రైతన్నకు అండగా నిలుస్తామంటూ సర్కారు ఇచ్చిన హావిూ అమలు కావడం లేదు. 15 నుంచి 20 రోజులుగా నేలపై వాలిపోయి కంకులు మొలకలెత్తి పోతున్నాయి. కోత కోద్దామంటే పంట నష్టం అంచనాలు వేయటానికి అధికారులు వస్తారేమోననే కొందరి ఆశ..! వారు వచ్చే వరకు వది లేస్తే పరిహారం మాట అటుంచితే ఒక్క గింజ కూడా మిగల కుండా పోతుందేమో అని మరి కొందరి ఆందోళన. ఇప్ప టికే దిగుబడి సగానికిపైగా తగ్గిపోతే, ఉన్న పంట ఖర్చులను కూ డా దక్కనిచ్చేలా లేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్న కొద్దిపాటి పంటనైనా దక్కించుకుందామని వరి కోతలకు రైతులు సిద్ధపడుతుంటే, కూలి భారం మరింత కుంగదీస్తోంది.