తెలంగాణను గందరగోళపరుస్తున్న కేంద్రం


ధాన్యం సేకరణలో మంత్రుల ద్వంద్వ వైఖరి

అందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం

రైతులకు బహిరంగ లేఖరాసిన నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి ’దూడను చీకమని, బర్రెను తన్న’మని చెప్పినట్లుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు భిన్నవాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారు. గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని ఇక్కడి గోదాముల నుంచి తరలించకుండా, ఆ నెపాన్ని రాష్ట్రం విూద నెట్టి రైతులను తప్పుదారి పట్టిస్తున్నదని మంత్రినిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. ఇంకోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ ’వరి సాగు విషయం లో తెలంగాణకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని పార్లమెంట్‌లో అన్నారు. బాయిల్డ్‌ రైస్‌ సేకరించలేమని ఒకవైపు, వరి సాగు విూద ఆంక్షల్లేవని ఇంకోవైపు ప్రకటించడం ద్వారా కేంద్రం ద్వంద్వ విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ బీజేపీ నేతలు ’వరి సాగు మాత్రమే చేయాల’ని చెప్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రైతాంగానికి బహిరంగ లేఖ రాశారు. కేంద్రం అనుసరిస్తున్న తీరుతో గందగరోళంలో పడ్డామని అన్నారు.  తెలంగాణ రైతాంగం ఈ భిన్న వైఖరులను గమనించాలన్నారు.  వాస్తవంగా దేశంలో కొరత ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించే రూ.2 లక్షల కోట్లకు బదులు, శాంతకుమార్‌ కమిటీ సూచన మేరకు దేశంలో వాటి సాగుకు, రాష్టాల్ర ద్వారా వాటిని సేకరించేందుకు కేంద్రం సహకారం అందించాలి. దేశంలో కార్పొరేట్‌ సంస్థలకు సుంకాలను తగ్గిస్తూ, లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తూ అండగా నిలుస్తున్నది. కానీ ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు ప్రోత్సాహం అందించడం లేదు. కార్పొరేట్లకు ఇస్తున్న సహకారం వ్యవసాయరంగానికి కేంద్రం అందిస్తే రైతులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆ దిశగా కేంద్రం ఆలోచించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలం. దీన్ని గమనించే సీఎం కేసీఆర్‌ దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతం. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ’మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌’ను ఏర్పాటుచేసి సీజన్‌కు ముందే ఏ రకమైన పంటలు సాగు చేయాలన్న దానిపై సూచనలు చేస్తున్నది. రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు ఇతర పంటల వైపు మళ్లాల్సిన అవశ్యకతను వివరిస్తున్నారు. కూలీల సమస్య తీరటం కోసం ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆరేండ్లుగా కేసీఆర్‌ కేంద్రాన్ని కోరుతున్నా వారి వైఖరిలో ఎటువంటి చలనం లేకపోవటం గర్హనీయం. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్థం చేసుకొని రైతులు ఈ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగుచేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పప్పు దినుసులు, నూనెగింజల పంటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షిస్తున్నదని వివరించారు.