భక్తుల రాకతో కిటకిటలాడుతున్నశ్రీశైలం

భారీగా తరలి రావడంతో సందడిగా గిరులు
శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవరోజు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారికి గజవాహనసేవ నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో గజవాహనంపై స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం జరుగనుంది.
శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామిదర్శనం చేసుకోవటానికి నల్లమల అటవీప్రాంతం నుంచి భారీగా భక్తులు తరలి రావడంతో శ్రీగిరులు భక్తులతో కోలాహలంగా మారయి. భక్తజనం ఓంకారం నడుమ దేవదేవులకు నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. శ్రీగిరి పురవీధుల్లో పుష్పపల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదిదంపతులైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు కల్యాణశోభతో ముస్తాబయ్యారు. ఆలయ ప్రాంగణంలోని అలంకారమండపంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణ లతో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తజనం నడుమ గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. ఉత్సవం ముంగిట మహిళల కోలాటాలు, వేషధారణలు, డోలు
విన్యాసాలు, నందికోళ విన్యాసాలు, బుట్టబొమ్మలు వంటి సాంస్కృతిక కళారూపాలు విశేషంగా
ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణం నుంచి అడుగడుగునా ఉత్సవమూర్తులకు మంగళహారతులు ఇచ్చుకుంటూ పురవీధుల్లోకి తీసుకువచ్చారు. గంగాధరమండపం వద్ద రంగు రంగుల పుష్పాలు, విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేసిన పుష్పపల్లకీలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి అర్చకులు మంగళహారతులిచ్చారు.