వేములవాడలో శివస్వాముల ఆందోళన

వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  వేములవాడ రాజన్న క్షేత్రంలో శివస్వాములు ఆగ్రహంతో రగిలిపోయారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని దీక్ష చేపట్టి మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తే తమను పట్టించుకోవడం లేదంటూ.. స్పర్శ దర్శనం కల్పించమని అడిగితే కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు, పాలకమండలి వైఖరిని నిరసిస్తూ ఆలయం చైర్మన్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద శివ స్వాములు ధర్నాకు దిగారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా స్వామి దర్సనం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. తమ మొక్కుబడుల గురించి.. ఆలయంలో పరిస్థితి గురించి అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయంలో శివ స్వాములకు విలువ ఇవ్వకుండా కేవలం రాజకీయ నాయకులకే ప్రాధ్యానత ఇస్తున్నారని వారు ఆరోపించారు.