టూరిజం కోసం లక్షకోట్లు తగలేశారు

మల్లన్న సాగర్‌ పేరుతో డబ్బులు వృధా

మండిపడ్డ కాంగ్రెస్‌ నేత పొన్నాల
హైదరాబాద్‌,ఫిబ్రవరి23( (జనం సాక్షి)):కేసీఆర్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. మల్లన్న సాగర్‌ ను సీఎం కేసీఆర్‌ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్‌ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్‌ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్‌ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయో చెప్పాలన్నారు. ఒక టూరిజం స్పాట్‌ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు. సాంకేతికంగా ఎత్తి పోతల పథకాల రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువగా ఉంటుంది.కానీ మల్లన్న సాగర్‌ 50 టీఎంసీ లతో సాంకేతికతకు తిలోదకాలు ఇచ్చారు. మైదాన ప్రాంతంలో కట్టిన రిజర్వాయర్‌ భవిష్యత్తు లో ప్రమాదం వాటిల్లితే.. జరిగే నష్టం ఊహించలేం. కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ సముద్రం పాలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకపోతే కోర్టు లలో కేసులు ఎందుకు పడ్డాయన్నారు. గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేది ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్‌ హయాంలో నిర్మాణం చేశామనే .. ఇప్పటి వరకు ఎల్లంపల్లిని జాతికి అంకితం చేయడం లేదని పొన్నాల విమర్శించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేసేటట్లయితే.. 2013 చట్టానికి ఎందుకు తూట్లు పొడిచావని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేశానని చెప్పడం పచ్చి అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రాణహిత చేవెళ్ల క్లోజ్‌ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు`రంగారెడ్డి ఎత్తి పోతలను ఆపేశారు. పాలమూరు రంగారెడ్డి అలైన్మెంట్‌ మార్చి .. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన అన్నారు. వికారాబాద్‌ ను ఔషధ నగరం చేస్తానని మాయమాటలు చెప్పారని ఆయన ఆరోపించారు. ఈ అన్యాయాలపై 26న బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడిరచారు. అనంతరం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు` మన పోరు పేరుతో ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ నెల 26న పరిగిలో భారీ బహిరంగ పెడుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, మోసాలపై సమరశంఖం పూరిస్తామన్నారు. ప్రాణహిత` చేవెళ్ల ప్రాజెక్టు పనులను నిలిపేశారని, సోనియా గాంధీ తెలంగాణను సంపన్న రాష్ట్రం ఇస్తే.. ఈ రోజు అప్పులమయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని, రంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారన్నారు.