ఐదురోజులపాటు సంతకాల సేకరణ ఉద్యమం
విజయవాడ,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): పీఆర్సీపై ఏపీ ఉపాధ్యాయులు తమ పట్టు సడలించడంలేదు. హెచ్‌ఆర్‌ఏ అంశంలో తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటి నుంచి టీచర్లు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తమకు అన్యాయం జరిగిందని టీచర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీని సాధించేందుకు ఉద్యుక్తులయ్యారు. తమ ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా మంగళవారం నుంచి ఐదు రోజులపాటు సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల జేఏసీపై అనుమానాలు వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు.. ప్రత్యేక పీఆర్సీ ఐక్య ఉద్యమ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం జగన్, సీఎస్ సవిూర్‌శర్మలను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే వీలు చిక్కక పోవడంతో ఇవాల్టి నుంచి 20 వ తేదీ వరకు సంతకాల సేకరణ చేపడుతున్నట్లు పీఆర్సీ ఐక్య ఉద్యమ వేదిక ప్రకటించింది. పీఆర్సీపై మరోసారి సవిూక్ష జరిపి తమకు న్యాయం చేయాలంటూ ఉపాధ్యాయులు సంతకాలు సేకరిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం టీచర్లను మోసం చేసిందంటూ వైసీపీ అనుబంధ సంస్థ వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర నేత ఒకరు ఇటీవల నిరాహారదీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అతడిపై వేటు వేశారు. అలాగే, చిత్తూరు జిల్లా నిమ్మనప్లలె మండలం పరిధిలోని బాలినాయనపల్లి స్కూల్ టీచర్ విష్ణువర్ధన్‌రెడ్డి విధుల్లోనే ఉండి నిరసనకు దిగారు. ఈయన కూడా వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.