బ్రోడాడీ తెలుగు వర్షన్‌లో నాగ్‌,అఖిల్‌ ?

  ( జనం సాక్షి):  
మనం సినిమా తర్వాత తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య కలిసి మరోసారి ’బంగార్రాజు’ చిత్రంతో అభిమానులపై వినోదాల జల్లు కురిపించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో డీసెంట్‌ కలెక్షన్స్‌ రాబట్టి.. సూపర్‌ హిట్‌ గా నిలిచింది. అయితే త్వరలో అఖిల్‌ కూడా తన తండ్రితో కలిసి నటించే సమయం ఆసన్నమైందని వార్తలొస్తున్నాయి. తన బాల్యంలోనే తండ్రి నాగార్జున తో ’సిసింద్రీ’ సినిమా ద్వారా తెరపై అల్లరి చేసిన అఖిల్‌.. ’మనం’లో తన కుటుంబ సభ్యులందరితో కలిసి అతిథిగా సందడి చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ నాగ్‌ , అఖిల్‌ కలిసి ఎప్పుడు స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్వరలోనే ఈ కాంబినేషన్‌ కార్యరూపం దాల్చనున్నట్టు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. నాగార్జున సొంత బ్యానర్‌ లో త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ తెరపై పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించబోతున్నట్టు టాక్‌. తాజా
సమాచారం ప్రకారం ఇది మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ’బ్రోడాడీ’ చిత్రానికి రీమేక్‌ వెర్షన్‌ అని తెలుస్తోంది. మోహన్‌ లాల్‌, పృధ్విరాజ్‌ సుకుమారన్‌ హీరోలుగా నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమా రీమేక్‌లో వెంకటేశ్‌, రానా, నటిస్తారని, ఆ తర్వాత వెంకీ, నాగచైతన్య నటిస్తారని టాక్స్‌ వినిపించాయి. అయితే ఇప్పడు నాగ్‌ అండ్‌ అఖిల్‌ తో ఈ సినిమా రూపొందనున్నట్టు టాక్స్‌ వినిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులిద్దరూ ఒకేసారి తండ్రులవడం ’బ్రోడాడీ’ సినిమాలోని హిలేరియస్‌ యాస్పెక్ట్‌. ఈ విషయాన్ని కవర్‌ చేయడానికి ఆ ఇద్దరూ ఎన్ని పాట్లు పడ్డారన్నది కథాంశం. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఒక వేళ నాగ్‌ అండ్‌ అఖిల్‌ నిజంగానే ’బ్రోడాడీ’ తెలుగు వెర్షన్‌ లో నటిస్తే మాత్రం మంచి వినోదం పండుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ఈ సినిమాకి చిరు ’గాడ్‌ ఫాదర్‌’ ను డైరెక్ట్‌ చేస్తున్న మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నట్టు టాక్‌. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ రానుందట.
.......................