ఆమె పాట అజరామరం

 

ఆమె పాట

పుష్పమై పరిమళిస్తే

గుండె ఆమని

పరవశిస్తుంది-

ఆమె పాట

దీపమై వెలిగిపోతే

హృదయ తిమిరం

తొలగిపోతుంది-

ఆమె పాట

తెమ్మెరయై స్పర్శిస్తే

బ్రతుకు చేను

పులకరిస్తుంది-

గుండె బిడ్డను

లాలించేందుకు

ఆమె పాట

అనునిత్యం

అవుతూ వుంటుంది

మాతృత్వపు జోల-

ఆ రాగాల లయల్లో

వూగుతూ వుంటుంది

జీవితం ఉయ్యాల-

ఆమె పాట

పల్లవించు

నిత్యహరితం-

ఆమె గానామృతం

అనుభూతుల గులకరాళ్లపై

ప్రవహించు జలపాతం-

ఆమె పాటను మనకు వదిలి

ఇప్పుడు

గంధర్వలోకానికేగింది-

ఆమె పాట అజరామరం

మనసుల లోగిళ్లలో

వినిపిస్తూనే వుంటుంది ఆ స్వరం-

(లతా మంగేష్కర్ కు నివాళిగా)

                  -  డాక్టర్ కొత్వాలు అమరేంద్ర  ( సెల్: 9177732414 )