` మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి 6(జనంసాక్షి): దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్ రెడ్డితెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తొలివిడతలో నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసి అందులోని లోటుపాట్లను తెలుసుకుందామన్నారు. అలాగే రాబోయే బడ్జెట్‌లో నియోజకవర్గానికి 2000 మందికి దళితబంధు పథకం అందనుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఈ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వనపర్తి నియోజకవర్గంలో మొదట దళితబంధు అమలుకు పెంచికలపాడు, మల్క్ మియాన్ పల్లి, నాచహళ్లి, గట్టుకాడిపల్లి, కర్ణమయ్యకుంట గ్రామాలను ఎంపిక చేశామని మంత్రి వివరించారు.తొలి విడతలో 81 దళిత కుటుంబాలకు అమలు చేస్తామన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లను నాణ్యతతో వెంటనే పూర్తి చేయాలన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సినేషన్‌లో జిల్లాలను అగ్రభాగాన నిలుపాలన్నారు.